© 2026 nimisham.in

దిల్లీ: తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తెలిపారు.
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి తన వివరణ ఇచ్చినట్లు చెప్పారు. నా వ్యవహారంపై పార్టీలో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదన్నారు. దిల్లీలో మీడియాతో కొండా సురేఖ మాట్లాడారు.
‘‘కాంగ్రెస్ అధిష్ఠానానికి నేను చెప్పుకోవాల్సిందంతా చెప్పాను. పార్టీ పెద్దలు ఆలోచిస్తామని చెప్పారు. నా బిడ్డ స్వతంత్రంగా ఉంది. పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలిగా మాట్లాడిందని అనుకుంటున్నాను. ఆమె జీవితం ఆమె ఇష్టం. నాతో పాటు నా భర్త రాజకీయ జీవితం మా ఇష్టం. నేను మంత్రిగా మంచి పనితీరు కనబరుస్తున్నాను. అవినీతి ఆరోపణలు లేకుండా పనిచేస్తున్నా. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నాను. పదవిలో కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరాను.
నా బిడ్డ వ్యాఖ్యలపై నేను స్పందించను. సుస్మిత వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. రోజూ ఎంతో మంది మాట్లాడతారు.. అందులో సుస్మిత కూడా ఒకరు. నా బిడ్డ కాబట్టి నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదు. ఆమె వ్యాఖ్యలను ఖండించడం, సమర్థించడం చేయను. నా వివరణను మీనాక్షి నటరాజన్‌కు చెప్పాను. అధిష్ఠానానికి ఆమె చెప్తానన్నారు. పార్టీలో కొందరితో నాపై ఆరోపణలు చేయించారు. ఎవరు అలా చేయించారో తెలుసు. పేర్లు చెబితే వివాదం అవుతుంది. నాపై ఆరోపణలు చేసిన వారికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. పార్టీ ఆ దిశగానూ ఆలోచించాలి. నాకు షోకాజ్ నోటీసు ఇవ్వడమే తప్పు. ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్నా.. అందుకే ఇక్కడికి వచ్చి నా బాధ చెప్పుకొన్నా. రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌కు రాతపూర్వకంగా వివరణ ఇచ్చా. పార్టీ తీసుకునే నిర్ణయం బట్టి నా ఆలోచన ఉంటుంది’’ అని కొండా సురేఖ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.