© 2026 nimisham.in

Disha Salian Death Case:దిశా సాలియన్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 2020లో జరిగిన ఆమె మరణంపై సీబీఐ దర్యాప్తుకు బాంబే హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరినీ నింది
తులుగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది.
దివంగత సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2020లో జరిగిన ఆమె మరణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో దర్యాప్తు చేయించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను ముంబై పోలీసులు సీబీఐకి అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ రంజిత్సిన్హా రాజా భోంస్లే నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని, అలాగే దిశా తండ్రి సతీష్ సాలియన్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు పేర్కొంది.
అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులో ఒక వ్యక్తిపై ఆరోపణలు నిర్ధారించడానికి తగిన ఆధారాలు లభించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఒకవేళ దర్యాప్తులో ఎలాంటి నేరం జరగలేదని తేలితే, సీబీఐ సంబంధిత కోర్టులో తగిన నివేదిక సమర్పించవచ్చని తెలిపింది.
దిశా సాలియన్ 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ భవనం 12వ అంతస్తు నుంచి కిందపడిపోయి మరణించారు. ఆమె మరణంపై అప్పట్లో ముంబై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెది ఆత్మహత్యగా పోలీసులు పేర్కొన్నారు.
అయితే దిశా తండ్రి సతీష్ సాలియన్ ఈ వివరణపై అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన నిజాలను కొందరు ప్రభావశీల వ్యక్తులను కాపాడేందుకు దాచిపెట్టారని కూడా ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
దిశా మృతి కేసులో సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన గత ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. అలాగే శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఆయన కోరారు. అయితే ప్రస్తుతం కోర్టు ఎవరినీ నిందితుడిగా ప్రకటించలేదు. సీబీఐ దర్యాప్తులో బయటకు వచ్చే ఆధారాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో దిశా సాలియన్ మృతి కేసులో అసలు నిజాలు ఏమిటనే దానిపై మరోసారి ఆసక్తి పెరిగింది.